లాక్‌డౌన్ 3.0 నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం పలు ఆంక్షలకు సడలింపు ఇచ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే రాష్ట్రాలు మద్యాన్ని అమ్ముకోవచ్చని కేంద్రం చెప్పింది. దీంతో సోమవారం నుంచి మద్యం విక్రయాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. అయితే మద్యం షాపుల వద్ద మందు బాబులు భారీ ఎత్తున క్యూలు కట్టారు. మద్యాన్ని కొనుగోలు చేసేందుకు లైన్లలో బారులు తీరారు. ఇక ఢిల్లీలో అయితే సోషల్ డిస్టాన్స్ నిబంధనలను మద్యం ప్రియులు గాలికి వదిలేయడంతో పోలీసులు మద్యం షాపులను మూసివేయించారు.
ఢిల్లీలోని లక్ష్మీనగర్, మయూర్ విహార్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద పెద్ద ఎత్తున గుమి కూడారు. లైన్లలో వేచి ఉండకుండా, సామాజిక దూరం పాటించకుండా వారు ఒకేసారి పెద్ద ఎత్తున షాపులకు రావడంతో పోలీసులు ఒక దశలో లాఠీ చార్జి చేశారు. అయినా పరిస్థితి మారకపోవడంతో వారు మద్యం షాపులను మూసేయించారు. ఇక కేవలం ఢిల్లీలోనే కాదు… దాదాపుగా మద్యం విక్రయిస్తున్న అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం షాపుల వద్ద ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం అమ్ముకోవచ్చని అనేక రాష్ట్రాలు చెప్పినప్పటికీ దాదాపుగా 40 రోజుల నుంచి మద్యం లభించకపోవడంతో మద్యం ప్రియులు సోమవారం పెద్ద ఎత్తున మద్యం షాపుల వద్ద బారులు తీరారు. ఇక కేంద్రం మద్యం షాపుల వద్ద 5 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో జనాలు ఉండకూడదని చెప్పింది. అయినప్పటికీ షాపుల వద్ద మద్యం ప్రియులు కిలోమీటర్ల మేర లైన్లలో బారులు తీరారు. దీంతో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది..!