నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలనే చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని గంటల తరబడి కూర్చోవాల్సి వస్తోంది. అయితే ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అమెరికాలోని టెక్సాస్ రియో గ్రాండే వేలీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒక్కసారి కూడా లేవకుండా గంటల తరబడి అలాగే కూర్చుని ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వారు అంటున్నారు.
గంటల తరబడి లేవకుండా అలాగే కూర్చుని ఉండడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, ప్రాణాంతక వ్యాధులు వస్తాయట. అలాగే అధికంగా బరువు పెరుగుతారట. అండాశయ, గర్భాశయ, పెద్దపేగు క్యానర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రోజులో 7 గంటలకు పైగా కూర్చుని పని చేసే వారికి ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయట.
కూర్చుని పని చేసే వారు మధ్య మధ్యలో కనీసం 30 నిమిషాలకు ఒకసారి అయినా లేచి అటు, ఇటు తిరగాలని సైంటిస్టులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని వారంటున్నారు. మధ్య మధ్యలో లేవడం, నిల్చోవడం, నెమ్మదిగా నడవడం వంటి పనులు చేయడంతోపాటు నిల్చుని పని చేసే డెస్కులను వాడడం వల్ల పైన చెప్పిన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక కూర్చుని పని చేసే వారు ఎవరైనా సరే మధ్య మధ్యలో లేచి అలా కొంత సేపు తిరగడం మంచిది. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.