దేశంలో గణేశ్ చతుర్థి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. తొలి రోజు గణేశుడికి భక్తులంతా ఘనస్వాగతం పలికారు. మండపాలను అందంగా ముస్తాబు చేసి వినాయకుడిని ప్రతిష్ఠించారు. చిన్నా పెద్దా అంతా కలిసి గణపయ్యకు పూజలు చేశారు. రకరకాల నైవేద్యాలు లంబోదరుడిని ఖుష్ చేశారు. డ్యాన్సులు, భజనలతో రాత్రంతా గణపయ్యను స్మరిస్తూ గడిపారు.
గణేశు చతుర్థి తొలి రోజున కొన్ని ప్రాంతాల్లో గణపతులు ప్రజలను ఆకర్షించాయి. ఒకచోట కరెన్సీ నోట్లతో లంబోదరుడిని తయారు చేశారు. మరోచోట వెండి గణపతి భక్తులకు దర్శనమిచ్చాడు. ఇక ట్రెండీ గణేశ్ విగ్రహాల్లో సినిమా పోస్టర్లను తలపించే.. పుష్ప, భీమ్, అల్లూరి సీతారామ రాజు గణపతులు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకర్షించాయి. భక్తులంతా వివిధ మండపాల్లో కొలువుదీరిన గణపతులను దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఓ వినూత్న రీతిలో కొలువైన గణపతి గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా కొట్టువారిపల్లికి చెందిన గణేశ్ రాయల్ అనే విద్యార్థి న్యూస్‌పేపరు, మైదాపిండితో 16 అడుగుల అందమైన వినాయక ప్రతిమను తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇందుకోసం రెండు నెలలు శ్రమించాడు. గణేశ్ తయారు చేసిన ప్రతిమనే గ్రామంలోని వినాయక మండపంలో ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. జొజ్జ వెంకటరమణ, మలేశ్వరి దంపతుల కుమారుడు గణేశ్ మదనపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు.