జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బలం బలగం అన్ని ఉన్నా, ఏపీలో తన పార్టీ జనసేన ను సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లే విషయంలో బాగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏ విషయంలోనూ క్లారిటీ లేనట్టుగానే వ్యవహరిస్తున్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ వ్యవహరించిన తీరు ఇదే రకమైన అనుమానాలను కలిగించింది. 2019లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందడానికి కూడా పవన్ లో రాజకీయ నాయకుడి లక్షణాలు కనిపించకపోవడమే కారణం అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక మొదటి నుంచి వైసీపీకి రాజకీయ శత్రువుగా, టిడిపికి రాజకీయ మిత్రుడిగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ పైనే విమర్శలు చేసే వారు వైసిపి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత పవన్ ఆ పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.
ఇక బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత, వైసీపీపై కొంత కాలం పాటు విమర్శలు చేశారు. కానీ బిజెపి పెద్దలు మాత్రం వైసీపీతో సఖ్యత గా ఉంటూ రావడంతో, పవన్ సైలెంట్ అయిపోయారు. ఇక మొదటి నుంచి తాను అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినవాడిని అంటూ చెప్పుకొన్న పవన్ చేగువేరా ను ఆరాధించేవారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ వైఖరిలో మార్పు మొదలైంది. కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు బీజేపీ అగ్రనేతలు ఎవరూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో, వారికి దగ్గరయ్యేందుకు పవన్ రకరకాల ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు పూర్తిగా హిందూ ఎజెండాను భుజానికెత్తుకుని పూజలు, పునస్కారాలు పేరుతో ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడమే కాకుండా, అంతర్వేది వంటి సంఘటనల్లో పవన్ యాక్టివ్ గా ఉంటూ విమర్శలు చేస్తున్నాడు. హిందుత్వానికి మద్దతుగా గట్టిగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి అందరివాడుగానే పిలిపించుకున్నారు. అయినా ఆయనపై కుల ముద్ర పడిపోవడంతో, ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఆ అనుభవాల నుంచి పవన్ గుణపాఠం నేర్చుకోలేదో ఏమో కానీ, ఇప్పటికీ ఆ పార్టీని అనుమానాస్పదంగానే నడిపిస్తూ,వస్తున్నట్లు గానే కనిపిస్తున్నారు.
ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లాలో పవన్ పర్యటించినప్పుడు ముస్లింలను ఈ దేశ భక్తులు అంటూ, వారిని వేరుగా చూడటం తగదు అంటూ బీజేపీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు హిందువుల పేరెత్తితే మతవాది అంటూ తనపై ముద్ర వేస్తారా అంటూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, పవన్ ఎవరూ ఊహించనంతగా బిజెపి మనిషిగా మారిపోయారు. హిందూ ఇజానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. పవన్ లో ఈ మార్పు జనాలే కాదు, జనసైనికులు ఊహించలేదు. మార్పు మంచిదేనా పవన్ ?
-Surya