ఈ సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో జరిగినన్ని గొడవలు ఎప్పుడూ జరగలేదు. గత కొన్నేళ్లుగా మా అధ్యక్ష ఎన్నికల వివాదం రచ్చకెక్కి ఇండస్ట్రీ జనాల పరువు బజారున పడేస్తోంది. అంతకు ముందు కూడా మా అధ్యక్ష ఎన్నికల వివాదంలో జయసుధ వర్సెస్ రాజేంద్రప్రసాద్ మధ్య జరిగిన వార్ రచ్చ రచ్చకు కారణమైంది. ఇక ఈ సారి కూడా పరిస్థితి అంతకన్నా ముదిరిపోయింది.
ఎన్నికలకు ముందు వరకు ఒకే ఫ్యానల్‌లో ఉన్న నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు ఎన్నికలు ముగిసినప్పటి నుంచే ఆధిపత్య పోరుకు తెరదీశారు. ఈ క్రమంలోనే గత ఆరు నెలలుగా ఎవరికి వారు ప్రెస్‌మీట్లు పెట్టుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మా పరువును ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు. కొద్ది రోజుల క్రితమే జీవితా రాజశేఖర్ దంపతులు నరేష్ రాకుండానే సమావేశం పెట్టడం… ఆ తర్వాత దానికి నరేష్ కౌంటర్ ఇవ్వడం జరిగాయి.
ఇక ఇప్పుడు మళ్లీ మా అధ్యక్షుడు నరేష్ మాలో వివాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి తాను ఎప్పుడైనా రెడీ అని… అంత మాత్రాన తనను ఎవ్వరూ బయటకు పంపలేరని కూడా చెప్పాడు. తాను అందరి సభ్యులు ఓట్లు వేస్తేనే అధ్యక్షుడిని అయ్యానని… తనకెవరు శత్రువులు లేరని కూడా అన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి పెద్దల సహకారంతో అందరిని కలుపుకుని వెళతానని చెప్పాడు.
ఇక మాలో గొడవలు ఉన్న మాట నిజమే అని.. తాను సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల అనుకున్నది చేయలేని మాట వాస్తవమే అని కూడా నరేష్ చెప్పాడు. ఏదేమైనా మా వివాదం ఈ ఫ్యాన్ పదవీ కాలం ముగిసేవరకు కూడా చల్లారేలా లేదు.