ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా క్లౌడ్ స్టోరేజ్ సేవలకు గాను డిజిబాక్స్ పేరిట నూతన సేవలను నీతి ఆయోగ్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ డ్రైవ్‌కు ఈ సర్వీస్ గట్టి పోటీనివ్వనుంది. డిజిబాక్స్ పూర్తిగా మేడిన్ ఇండియాకు చెందిన సర్వీస్ కాగా.. ఇందులో యూజర్లకు క్లౌడ్ స్టోరేజ్ సేవలు లభిస్తాయి. ఇక వారి డేటా అంతా ఇండియాలోని సర్వర్లలోనే స్టోర్ అవుతుంది. ప్రస్తుతం డిజి బాక్స్ సేవలు వెబ్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఐఓఎస్‌లోనూ ఈ సేవలు లభిస్తాయి.
డిజిబాక్స్ సర్వీస్.. గూగుల్ డ్రైవ్, యాపిల్ ఐ క్లౌడ్ మాదిరిగా పనిచేస్తుంది. ఇందులో యూజర్లు, వ్యాపారులు తమ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. కంపెనీలు అయితే ఆ డేటాను ఉద్యోగులకు షేర్ చేసి దాంతో పని చేయించుకోవచ్చు. పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ఇక డిజిబాక్స్‌లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోని వాడుకోవచ్చు. అదే స్టోరేజ్ ఎక్కువ కావాలంటే స్వల్ప మొత్తంలో రుసుం చెల్లిస్తే చాలు. నెలకు కేవలం రూ.30కే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
డిజిబాక్స్ ఉచిత అకౌంట్ ద్వారా యూజర్లకు 20 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. గరిష్టంగా 2 జీబీ వరకు సైజ్ ఉండే ఫైల్స్ ను పంపించుకోవచ్చు. జీమెయిల్‌తో కలిపి డిజిబాక్స్ ను వాడుకోవచ్చు. ఇక 5టీబీ, 50టీబీ స్టోరేజ్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.999 నెలకు చెల్లిస్తే 50 టీబీ స్టోరేజ్ లభిస్తుంది. గరిష్టంగా 10 జీబీ వరకు సైజ్ ఉండే ఫైల్స్‌ను ఇందులో పంపించుకోవచ్చు. కాగా DigiBoxx యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్ యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. అయితే వెబ్ ద్వారా కూడా DigiBoxx సేవలను ఉపయోగించుకోవచ్చు.