మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని రాణీ దుర్గావతి హాస్పిటల్‌లో మదర్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. తల్లుల నుంచి చనుబాలలను సేకరించి నిల్వ చేయడం, అవసరమైన నవజాత శిశులకు అందజేయనున్నారు.
కొంత మంది పాలు ఇచ్చే స్త్రీలు ఎక్కువ మొత్తంలో పాలు ఇవ్వడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
మరోవైపు మరికొంత మంది తల్లులు తమ పిల్లలకు అవసరమైన స్థాయిలో చనుబాలను ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాణీ దుర్గావతి హాస్పిటల్‌లో మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఆరోగ్య సేవల జాయింట్ డైరెక్టర్ సంజయ్ మిశ్రా తెలిపారు.
ఎక్కువ చనుబాలు వస్తున్న తల్లుల నుంచి శ్రేష్ఠమైన పాలను సేకరించి పాశ్చరైజేషన్ చేసి నిల్వ ఉంచుతారు. తక్కువ పాల వస్తున్న తల్లులను గుర్తించి వారి పిల్లలకు నిల్వ ఉంచిన చనుబాలను అందజేస్తారు.
కేవలం రాణీ దుర్గావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారికే కాకుండా, ప్రైవేట్ హాస్పిటళ్ల నుంచి వచ్చే వారికి సైతం ఉచితంగానే తల్లి పాలను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.