టర్కీ, గ్రీస్‌లో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇజ్మిర్ పట్టణంలో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రీకు ద్వీపం సమోస్‌కు ఉత్తరాన టర్కీ ఏజియన్ తీరాన్ని శుక్రవారం శక్తివంతమైన భూకంపం తాకింది. టర్కీలోని పశ్చిమతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మిర్ ప్రావిన్స్‌లోని ఇజ్మీర్ నగరంతోపాటు రాజధాని ఇస్తాంబుల్, గ్రీస్‌లోని ఏథెన్స్ నగరాలు ప్రకంపనల ధాటికి వణికిపోయాయి.
పలు వీధుల్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా సముద్రంలో స్వల్ప సునామీ సంభవించి వీధుల్లోకి నీరు చేరింది. ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం నిక్షిప్తమైనట్లు టర్కీ అత్యవసర విపత్తు స్పందనా దళం తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారికి కోసం అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రాణనష్టం పై ఇంక ఎలాంటి సమాచారం లేదు.