టీ బీజేపీలో ఆ మూడు జిల్లాల నేతలదే హడావిడా…?

-

దుబ్బాకలో బీజేపీ పోటీ చేస్తున్నా.. ఆ మూడు జిల్లాల నేతలదే పెత్తనమా ? దుబ్బాక ఉప ఎన్నిక వేళ ఇప్పుడు కమలం పార్టీ నేతల్లో ఇదే చర్చ నడుస్తుంది. దుబ్బాకలో బీజేపీ ఎన్నడూ గెలిచింది లేదు. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఆ పార్టీ ట్రాక్‌ రికార్డ్ దుబ్బాకలో అంత గొప్పగా ఏమి లేదు. స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపెట్టలేదు. క్షేత్రస్థాయిలో పట్టున్న ప్రజాప్రతినిధులు లేరు. అయినా ఉపఎన్నికలో చాలా ఆశలు పెట్టుకున్నారు కమలనాథులు.


మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల బీజేపీ నాయకులే దుబ్బాక ప్రచారంలో కనిపిస్తున్నారు. చివర్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెళ్లారు తప్ప.. పెద్దగా హడావిడి లేదు. సిద్ధిపేటలో నగదు దొరికిందన్న సమయంలో కిషన్‌రెడ్డి వెళ్లినా.. కామ్‌గా వచ్చేశారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనుకున్నంత దాడి చేయలేదని కామెంట్స్‌ చేశారు.

కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ మినహా హైదరాబాద్‌కు చెందిన ఉద్ధండులైన బీజేపీ నాయకులు దుబ్బాక ప్రచారంలో తమ ముద్ర వేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీవర్గాల్లో చర్చకానీ.. ప్రెస్‌మీట్లు కానీ లేవన్నది బీజేపీలో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఆయన ఎదుర్కొంటున్న తొలి ఉపఎన్నిక ఇది. దుబ్బాకలో వచ్చే ఫలితంతో ఆయన బలం ఏంటో తేలిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయట పార్టీ వర్గాలు. అందుకే సంజయ్‌ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news