ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలమూరు జిల్లానే బీజేపీ పుట్టి ముంచిందా ?

-

టీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు బీజేపీలో చేరడంతో పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే పాలమూరు బీజేపీలో కొత్త జోష్ కనబడింది. వీరి రాకతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తామని కమలనాథులు లెక్కలేశారు. కానీ రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలతో పోలిస్తే పాలమూరులోనే బీజేపీకి గ్రాడ్యుయేట్ ఓటర్లు హ్యాండిచ్చారు. ఇది ఏకంగా పార్టీ అభ్యర్ధి ఓటమికి దారితీయడంతో పాలమూరు జిల్లా పై మథనం మొదలెట్టింది కాషాయ శిబిరం.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. వీరితోపాటు కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేతలు కమలం కండువా కప్పేసుకున్నారు. ఇక ఏ ఎన్నికల్లో అయినా ఎదురులేదని ఇన్నాళ్లు లెక్కలేసుకున్నారు బీజేపీ నేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి అంచనాలన్ని తలకిందులయ్యాయి. సిట్టింగ్‌ స్థానం కోల్పోవడానికి పాలమూరు జిల్లా ఓట్లే దెబ్బతీశాయని అనుకుంటున్నారట.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కంటే తక్కువ ఓట్లు బీజేపీకి పాలమూరులో పడ్డాయట. మిగతా రెండు జిల్లాలతో పోల్చుకుంటే పాలమూరులో ఈ దఫా ఎక్కువ పోలింగ్‌ నమోదైంది. 2015లో ఈ జిల్లాలో 55 పోలింగ్‌ నమోదైతే.. ఈసారి ఏకంగా 78 శాతానికి పెరిగింది. ఓటర్ల నమోదుతోపాటు ప్రతి ఓటరును పోలింగ్‌ స్టేషన్‌ వరకు రప్పించడంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పెట్టిన ఎఫర్ట్‌ బీజేపీలో లేదట. కేవలం అర్బన్‌ ఓటింగ్‌పైనే దృష్టిపెట్టిన బీజేపీ నేతలు.. గ్రామీణ ప్రాంతాల ఓటర్లను లైట్‌ తీసుకున్నారట.

గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత రామచంద్రరావు పాలమూరుకు ముఖం చాటేశారనే అపవాదు పార్టీకి కొంత నష్టం చేసినట్లు తెలుస్తుంది. జిల్లాలో బీజేపీకి సీనియర్లు ఉన్నా.. ఎన్నికల సమయంలో వారి మధ్య సమన్వయం కొరవడిందని చెబుతున్నారు. వీటితో పాటు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ప్రైవేటీకరణ నిర్ణయాలు, రైతు ఉద్యమాల ప్రభావం చూపినట్టు తెలుసుకున్నారట. మరో వైపు వర్గ విభేదాలతో చాలా మంది సీనియర్లు, నియోజకవర్గ ఇంఛార్జులు ప్రచారంతోపాటు ఇతర విషయాల్లో అంటీముట్టనట్టు వ్యవహరించారని తెలుస్తుంది. ఇవన్ని కలగలిపి సిట్టింగ్ సీటు బీజేపీ కోల్పోవలసి వచ్చిందని పాలమూరు నేతల పై గుర్రుగా ఉన్నారట పార్టీ అగ్ర నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version