కిలో వంకాయ ధర ఎంతుంటుంది సాధారణంగా. కూరగాయల మార్కెట్ కు వెళ్తే 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. మరి.. అదే వంకాయను పండించిన రైతుకు కిలో వంకాయ ఎంత పడుతుందో తెలుసా? 20 పైసలు. అవును. మీరు చదివింది కరెక్టే. కిలో వంకాయను హోల్ సేల్ మార్కెట్ లో 20 పైసలకు అమ్ముకోవాల్సి వచ్చింది ఓ రైతుకు దీంతో.. కోపొద్రికుడైన ఆ రైతు తన రెండెకరాల్లో వేసిన వంకాయ తోటనంతా నాశనం చేసేశాడు.
ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మెద్ నగర్ లో ఉన్న సకురి గ్రామంలో చోటు చేసుకున్నది. ఆ రైతు పేరు రాజేంద్ర బవాకె. ఆయన ఏమంటున్నాడంటే.. నా రెండెకరాల్లో భూమిలో 2 లక్షలు ఖర్చు పెట్టి మరీ వంకాయ తోటను వేస్తే.. వంకాయ దిగుబడి మీద నాకొచ్చిన డబ్బులు 65 వేల రూపాయలు. అంటే లక్షా 35 వేల రూపాయలు నాకు లాస్. వంకాయ తోట కోసం డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించా. పెస్టిసైడ్స్ ఉపయోగించా. దిగుబడి పెంచడానికి వివిధ రకాల ఆధునిక పద్ధతులు ఉపయోగించా. దిగుబడి వచ్చాక నాసిక్, సూరత్ తీసుకెళ్తే కిలో 20 పైసల చొప్పున వంకాయలను కొన్నారు. దీంతో ఇంకా ఈ వంకాయ తోట వల్ల నష్టపోకూడదని దాన్న మొత్తం నాశనం చేసేశా.. అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆ రైతు.
ఇలాగే మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఉల్లిగడ్డ రైతు కిలో ఉల్లిగడ్డను 1.40 పైసలకు అమ్ముకోవాల్సి వచ్చి.. దానికి వచ్చిన డబ్బులను ప్రధాని మోదీకి పంపించాడు. దేశవ్యాప్తంగా రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఇటీవలే.. దేశంలోని చాలా రాష్ట్రాలకు చెందిన రైతులు గిట్టుబాటు ధర కోసం న్యూఢిల్లీని ముట్టడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరలపై సరైన రెస్పాన్స్ లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనడానికి ఈ ఘటనలే ఉదాహరణ.