కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విధించబడిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వలస కార్మికుల బతుకులు ఛిద్రమయ్యాయి. చేసేందుకు పనిలేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. తింటానికి తిండి లేదు.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేదు.. దీంతో దిక్కు తోచని స్థితిలో వారు కాలం వెళ్లదీస్తున్నారు. ఇక కొందరు కాలినడకనైనా సరే.. సొంత ఊళ్లకు వెళ్దామని బయల్దేరుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే ఇలాంటి వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడి స్కూళ్లు, కల్యాణ మండపాల్లో వలస కార్మికులకు ఆశ్రయం కల్పించనున్నారు.
ముంబైలోని వేల మంది వలస కార్మికులు, లక్షల మంది నిరాశ్రయులకు అక్కడి స్కూళ్లు, కల్యాణ మండపాల్లో ప్రస్తుతం ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అధికారులు 9 స్కూళ్లను స్వాధీనం చేసుకుని వాటిల్లో 3200 మందికి ఆశ్రయం కల్పించారు. స్కూళ్లు, కల్యాణ మండపాల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు ఉంటాయి కనుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తెలిపారు.
ఇక ఆయా ప్రాంతాల్లో ఆశ్రయం పొందేవారికి తాగునీరు, భోజన సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని సీఎం థాకరే తెలిపారు. దీంతోపాటు వారికి ఎప్పటికప్పుడు కరోనా స్క్రీనింగ్ టెస్టులు చేస్తామన్నారు. వారికి ఉన్న ఇతర అనారోగ్య సమస్యలను కూడా తెలుసుకుని అక్కడే చికిత్స అందిస్తామని అన్నారు.