మహారాష్ట్ర రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంలో ఊరట..

-

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండేతో పాటు మరో 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత వేటు వేశారు. దీంతో.. ఆ నోటీసులకు వ్యతిరేకంగా రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు . అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని, ముంబైలో న్యాయపరమైన పరిష్కారాలను కొనసాగించేందుకు వాతావరణం అనుకూలంగా లేదని ఆ వర్గం తెలిపింది. అంతేకాదు వారికి నోటీసులు జారీ చేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న నీరజ్ కిషన్ కౌల్ తెలియజేశారు.

రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత మూడు రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని తెలిపింది. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పైగా రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని న్యాయస్థానం సూచించింది. ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version