కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పేరు. ప్రపంచ దేశాలన్నింటికీ ఈ వైరస్ ఇప్పుడు క్రమక్రమంగా విస్తరిస్తోంది. భారత్ లో కూడా ఇప్పటికే 110 మందికి ఈ వైరస్ సోెకినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. దీనిపై సెలబ్రిటీలు సైతం తమ వంతు బాధ్యతగా పలు సూచనలు చేస్తున్నారు.ప్రజల ప్రాణాల్ని హరిస్తోన్న కరోనా వైరస్ పై అవగాహన పెంపొందించడంలో భాగంగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా పలు సూచనలు చేశారు.
“ఇది చాలా కఠిన సమయం. కానీ మనం తప్పక జాగ్రత్తలు పాటించాలి. వీలైనంతవరకూ ఇంట్లోనే ఉండండి. కుటుంబ సభ్యులతో గడపడానికి ఈ సమయం వినియోగించుకోండి. ఇలా చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టి ఎన్నో జీవితాలను కాపాడుకోవచ్చు. తరచూ చేతుల్ని సబ్బుతో కడుక్కోండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి.”అని మహేబ్ బాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు బంద్ ప్రకటించింది. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళను సైతం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 5కి చేరినట్లు మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. వైరస్ ప్రభావంతో ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.