బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. గ్యాస్ ధరల పెంపు పై కేంద్రాన్ని టార్గెట్ చేసుకొని ధర్నాలకు దిగారు. సామాన్యుల కష్టాలను అర్థం చేసుకోకుండా వంటింట్లో మంట పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో సిలిండర్ ధర 53% పెంచిందని, 2014 నుండి ఇప్పటివరకు అత్యధికంగా 169% ధర పెరిగిందని, ధనికులు మరింత ధనవంతులు అయ్యారని, పేదలు మరింత పేదవారు అయ్యారని మండిపడుతున్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, హోం మంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. కుటుంబం లేని ప్రధాని మోదీకి గ్యాస్ ధరల కష్టాలు తెలియవు అని విమర్శించారు. గ్యాస్ ధరలు, నిత్యవసర ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెను భారం మోపారని మండిపడ్డారు.