మాలి దేశ సైనికులపై ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 14 మంది సైనికులు మృతి చెందారు. మరో 12 మంది సైనికులు గాయపడ్డారు. సెంట్రల్ మాలిలోని కౌమారా, మాసినా పట్టణాల మధ్య ఈ పేలుళ్లు జరిగినట్లు ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సౌలేమనే డెంబెలే తెలిపారు. మరో రెండు గ్రామాల్లో కూడా తీవ్రవాదులు దాడి చేసినట్లు డెంబెలే పేర్కొన్నారు. ఈ వారం మొదట్లో 30 మందికి పైగా ఉగ్రవాదులను మాలి సైనికులు హతమార్చినట్లు చెప్పారు.
“హింసను అరికట్టడానికి అదనపు సైనికులను నియమించినప్పటికీ, దేశంలో తీవ్రవాదుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తీవ్రవాదాన్ని రూపుమాపాలనే ప్రయత్నం ఫలించడం లేదు.” అని ఇంటెలిజెన్స్ అడ్వైజరీ సీఈఓ లైత్ అల్ఖౌరి తెలిపారు. ఈ ఘటన మాలి సైనికుల సంకల్పాన్ని బలహీన పరిచే అవకాశం ఉందని.. ఇలాంటి దాడులు మరిన్ని జరిగితే సైన్యం అదనపు భద్రత చర్యలను చేపట్టవలసి ఉంటుందని ఆయన వెల్లడించారు.