ఏఐసీసీ చీఫ్ గా ఖర్గే తొలి నిర్ణయం.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్‌ కమిటీ

-

ఏఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తొలి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్థానంలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీతో పాటు 47మంది ఈ స్టీరింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (b) ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో తక్షణ నిర్ణయాల కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

పార్టీ మాజీ అధ్యక్షులైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ స్టీరింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ, అభిషేక్‌ మను సింఘ్వి, ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, ముకుల్‌ వాస్నిక్‌, చిందంబరం, రణ్‌దీప్ సూర్జేవాలా, అధిర్‌ రంజన్‌ చౌదరి, దిగ్విజయ్‌ సింగ్‌, మాణికం ఠాగూర్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ వంటి వారు స్టీరింగ్‌ కమిటీలో చోటు దక్కించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సుబ్బరామిరెడ్డికి ఈ కమిటీలో చోటు దక్కింది. G-23 వర్గంలో ఉన్న ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌కు సైతం ఈ కమిటీలో చోటు దక్కింది. అంతకుముందు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులంతా కొత్త కమిటీ ఏర్పాటుకు వీలుగా తమ పదవులకు రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version