కరోనా బారిన పడి కోలుకున్న వారు తాము వైరస్ నుంచి విముక్తి పొందామని, ఇకపై తమకు మళ్లీ వైరస్ సోకే అవకాశం లేదని.. అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే.. ఒక్కసారి కోవిడ్ బారిన పడినా.. మళ్లీ మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అందుకు ఈ సంఘటనే ఉదాహరణ. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఒకే నెలలో రెండు సార్లు కరోనా సోకింది.
పశ్చిమబెంగాల్‌లోని జల్‌పయ్‌గురి అనే ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏళ్ల ఓ వ్యక్తి వైద్య సిబ్బందిగా సేవలు అందిస్తున్నాడు. అతనికి జూన్ రెండో వారంలో కరోనా సోకగా చికిత్స తీసుకున్నాడు. అయితే కోవిడ్ నుంచి కోలుకున్నాక.. మళ్లీ నెల తిరగక ముందే ఇన్‌ఫెక్షన్ సోకింది. కోవిడ్ లక్షణాలు కనబడ్డాయి. దీంతో అతను మళ్లీ టెస్టులు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో అతను మళ్లీ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే సాధారణంగా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారిలో యాంటీ బాడీలు ఉంటాయి. అందువల్ల మళ్లీ కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదని గతంలో పలువురు సైంటిస్టులు తెలిపారు. కానీ దాన్ని వారు శాస్త్రీయంగా రుజువు చేయలేదు. అయితే తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. మరోసారి ఈ విషయంపై సైంటిస్టులు దృష్టి పెట్టారు. మరోవైపు చైనాలోనూ రెండోసారి కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సోకిన కేసులు గతంలో బయట పడ్డాయి. సరిగ్గా ఇక్కడ కూడా అలాగే జరిగింది. దీంతో సైంటిస్టులు అలర్టయ్యారు. అసలు కోవిడ్ నుంచి కోలుకున్నాక.. బాధితుల శరీరాల్లో యాంటీ బాడీలు ఉంటాయా, ఉండవా, ఉంటే అవి మళ్లీ కోవిడ్ రాకుండా ఎందుకు అడ్డుకోలేవు ? వంటి అంశాలపై వారు పరిశోధనలు చేపట్టారు. త్వరలో ఈ విషయంపై వారు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కనుక.. కోవిడ్ నుంచి కోలుకున్న వారు అయినా సరే.. మళ్లీ తమకు వైరస్ వ్యాపించదు.. అని అనుకోకూడదు. తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే.