పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ముందుకుతీసుకు వెళ్లేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులతోనూ మండలాల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. ఇక,జిల్లాల విభజనకు వచ్చే ఏడాది మార్చి తర్వాత ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఇదిలావుంటే, ఇప్పుడు జిల్లాల విభజన వైఎస్సార్ సీపీలోనే కొన్ని వర్గాలను కలవరపెడుతోంది.
గుంటూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, నరసరావుపేట మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి రాజకీయాలకు తీవ్ర సంకటంలో పడతాయని అంటున్నారు ఆయన అనుచరులు. ఆయన ఇప్పటి వరకు గుంటూరులో రాజకీయాలు చేయాలని ఎంతో అనుకున్నారు. గత ఏడాది ఎన్నికల్లో పట్టుబట్టి మరీ.. గుంటూరు ఎంపీ స్థానం టికెట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కూడా మారారు. అయితే, ఇప్పుడు ఈయన రాజకీయం మారుతుందని అంటున్నారు. గుంటూరు జిల్లాను పార్లమెంటు నియోజకవర్గాల వారిగా విభజిస్తే.. మూడు కానుంది.
అంటే.. ఇప్పటికే ఉన్న మూడు పార్లమెంటు స్థానాలు గుంటూరు, బాపట్ల, నరసరావుపేటలు జిల్లాలుగా ఏర్పడతాయి. ప్రస్తుతం మోదుగుల ఓటు హక్కు నరసరావుపేటలో ఉంది.దీంతో ఆయన ఆ జిల్లా పరిధిలోకి వెళ్లిపోతారు. దీంతో జిల్లా విభజన జరిగితే.. గుంటూరులో రాజకీయంగా చక్రం తిప్పాలంటే.. ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన నాయకులు ఎక్కువ. సో.. ఇక్కడ ఉంటారా? లేక గతంలో తనను గెలిపించిన నరసరావుపేట కు వెళ్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా జగన్ జిల్లాల విభజన పరిణామాలతో మోదుగుల వర్గం తర్జన భర్జన పడుతుండడం గమనార్హం. ఏదేమైనా.. మోదుగుల రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.