కంపెనీ బోర్డు సమావేశం అంటే కంపెనీ యొక్క స్థితిగతులు,అలానే కంపెనీ ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అంటూ సమావేశంలో చర్చించుకోవడం సహజం. కానీ ఢిల్లీ లోని నోయిడా లో మాత్రం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూపీ టెలీలింక్స్ అనే కంపెనీ డైరక్టర్ల సమావేశం జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడడం అందరిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. అయితే ఆ అనర్ధం ఆపే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే బోర్డు మీటింగ్ లో కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆ కంపెనీ సీనియర్ డైరక్టర్ ప్రదీప్ అగర్వాల్ అని , ఆయన మరో ఇద్దరు డైరెక్టర్ల పై తుపాకీ తో కాల్పులు జరపగా వారిలో నరేష్ గుప్తా అనే ఒక డైరెక్టర్ సంఘటనా స్థలం లోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే వారిపై కాల్పులు జరిపిన ప్రదీప్ అగర్వాల్ అనంతరం తనను తాను కాల్చుకోవడం తో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనితో ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇదే ఘటనలో మరో డైరెక్టర్ జైన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.
దీనితో ఆయనను వెంటనే ఆసుపత్రి కి తరలించినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని అక్కడ పరిస్థితులను గమనించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు కూడా ఆ కంపెనీ డైరెక్టర్లు గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు కాగా, వారి మధ్య ఏర్పడ్డ వ్యాపార గొడవలే అసలు ఈ కాల్పులకు కారణం అంటూ పోలీసులు అనుమానము వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.