ఇంటి అద్దె చెల్లించ‌లేద‌ని పోలీసు అధికారి చావ‌బాదాడు.. వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

-

చెన్నైలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. గ‌తంలో లాక్‌డౌన్ సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన తండ్రీ కొడుకులిద్ద‌రిని పోలీసులు క‌స్ట‌డీలో తీవ్రంగా చావ‌బాదారు. దీంతో వారు చ‌నిపోయారు. ఇక తాజాగా దాదాపుగా ఇదే త‌ర‌హాలో మ‌రొక ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్య‌క్తి ఇంటి అద్దె ఇవ్వ‌డం లేద‌న్న కోపంతో ఓన‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. ఓ అధికారి వ‌చ్చి ఆ అద్దెకుంటున్న కుటుంబ య‌జ‌మానిని చావ‌బాదాడు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆ వ్య‌క్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న అక్క‌డ ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది.

చెన్నైలోని పుజ‌ల్ అనే ప్రాంతంలో శ్రీ‌నివాస‌న్ అనే ఓ పెయింట‌ర్ త‌న భార్య, పిల్ల‌ల‌తో క‌లిసి జీవిస్తున్నాడు. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త 4 నెల‌లుగా అత‌నికి ప‌నిలేకుండా పోయింది. దీంతో శ్రీ‌నివాస‌న్ తాను ఉంటున్న ఇంటి అద్దె క‌ట్ట‌డం లేదు. అయితే ఇదే విష‌య‌మై ఓన‌ర్ ప‌లుమార్లు శ్రీ‌నివాసన్‌ను అడిగినా త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని, వ‌చ్చిన‌ప్పుడు ఇస్తాన‌ని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఓన‌ర్ పుజ‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు.

అయితే ఆ ఇంటి ఓన‌ర్ స్థానికంగా ఓ పార్టీకి చెందిన నాయ‌కుడు. దీంతో అత‌ని ఫిర్యాదు తీసుకున్న స‌ద‌రు పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ అత‌ని ఇంటికి వెళ్లి శ్రీ‌నివాస‌న్‌ను అత‌ని భార్య‌, పిల్ల‌ల ఎదుట చిత‌క‌బాదాడు. ఈ క్ర‌మంలో అవ‌మానానికి గురైన శ్రీ‌నివాస‌న్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. అది గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు అత‌న్ని సమీపంలో ఉన్న కిల్‌పౌక్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస‌న్ హాస్పిట‌ల్‌లో 80 శాతం కాలిన గాయాల‌తో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఇందుకు కార‌ణ‌మైన స‌ద‌రు పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను ఇప్ప‌టికే స‌స్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version