రహదారి భద్రత, ప్రజల ప్రాణాలకు రక్షణను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ట్రాఫిక్ చట్టం ప్రజలకు మంట పుట్టిస్తోంది. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇంకా ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఈ చట్టం ఆయా రాష్ట్రాల్లో అమలు కావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల శాసనసభల ఆమోదం తప్పనిసరి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకోకపోయినా, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు.
ఈ చట్టం అమల్లోకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రజలపై తమ ప్రతాపం చూపించేస్తున్నారు. వేలాది రూపాయల చలానా వేసేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రావడంతో ఎక్కడ చూసినా చలానాల మోత మోగిపోతోంది. ఈ చలానాలు దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలకు కారణం అవ్వడంతో పాటు సరికొత్త సంచలనాలకు కారణమవుతున్నాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ బైక్ యజమానికి రూ.23 వేల చలానా రాశారు. ఆ బైక్ ఖరీదు రూ.15 వేలు అయితే తాను రూ.23 వేలు ఎందుకు చలానా కడతానని ఆ బైక్ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
రాజస్థాన్‌లో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.23 వేలు, ఓడిశాలో ఓ ఆటోడ్రైవర్‌కు రూ. 47 వేలు ఫైన్ వేయడంతో ఈ రెండు సంఘటనలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఇక మరికొంత మందిలో అసహనం పెరిగిపోవడంతో అతడు కేంద్రంపై తన నిరసనను వ్యక్తం చేస్తూ.. బైక్‌కు నిప్పు పెట్టేశారు. ఆ బైక్ మంటల్లో తగలబడి పోతుండడంతో చివరకు పోలీసులే ఆ మంటలు ఆర్పారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ సంఘటన జరిగింది.
బైక్ వేసుకుని వెళుతోన్న ఆ వ్యక్తిని ఆపిన పోలీసులు రూ.3900 ఫైన్ వేయడంతో చిర్రెత్తుకొచ్చిన అతడు తన సిగరెట్ వెలిగించుకునే లైటర్ తీసుకుని బైక్ పెట్రోల్ ట్యాంకులో వేయడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. చివరకు పోలీసులు ఆ మంటలు అదుపు చేశారు. ఏదేమైనా ఈ కొత్త చట్టంతో సామన్యులు పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. కొందరైతే ఏకంగా బైక్‌లు పక్కన పెట్టేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.