అపార్ట్ మెంట్ లిఫ్టులో ఉండగానే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. అదనపు కట్నం తీసుకురాలేదని ఇలా చేశాడు. అతడి వెంటే వెళ్లిన ఆమెను ఇంట్లోకి రానీయకుండా గెంటేశాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని సుద్దుగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే.. బాధితురాలికి మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అతడికి రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్లు అదనపు కట్నం కోసం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. అతను ఎంత వేధించినా బాధితురాలు భరించేదే తప్ప తన తల్లిదండ్రులు ఈ విషయం చెప్పలేదు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని అక్రమ్ తన భార్యను ఇంట్లో నుంచి తరిమేశాడు.
ఏం చేయాలో పాలుపోక.. ఎక్కడికి వెళ్లాలో అర్థంగాక బాధితురాలు తన పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అక్రమ్ కు ఎంతగానో సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా అతను వినకపోవడంతో అతను అడిగిన డబ్బు సర్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటి వరకు బాధితురాలు తన పుట్టింట్లోనే ఉంటోంది.
ఓ రోజు పుట్టింట్లో ఉన్న భార్యకు అక్రమ్ ఫోన్ చేశాడు. ఓసారి ఇంటికి రమ్మని పిలిచాడు. భర్త ఫోన్ రాగానే ఆమె ఎంతో సంబురపడింది. అతను మనసు మార్చుకున్నాడేమోనని సంతోషపడి తల్లిదండ్రులకు విషయం చెప్పి తన ఇంటికి బయలుదేరింది. అయితే ఆమె తన అపార్ట్ మెంట్ లిఫ్టులో ఉండగానే అక్రమ్ ఆమెకు మూడు సార్లు తలాక్ చెప్పి ఇక తనతో ఏం సంబంధం లేదని వెళ్లిపోయాడు.
భర్త చేష్టలకు షాకైన బాధితురాలు అతడి వెంటే వెళ్లింది. తనకు అన్యాయం చేయొద్దంటూ బతిమాలింది. అయినా వినిపించుకోని అక్రమ్ ఆమెను ఇంట్లోకి రానీయకుండా గెంటేశాడు. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పిన ఆమె.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.