రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక సంఘటన చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య వివాదం సద్దుమణగక ముందే తెలంగాణ మరో కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారని, టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై మాణికం ఠాగూర్ స్పందించారు. టీ కాంగ్రెస్ నేతల వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకుంది నిజమేనని స్పష్టం చేశారు. కానీ, వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అయ్యారనేది మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. ఏఐసీసీ వాట్సాప్ గ్రూప్లో మాణికం ఠాగూర్ కొనసాగుతున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరుపై మాణికం ఠాగూర్ గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్టు తెలుస్తోంది. నేతల మధ్య ఉన్న విభేదాలను ఆయన పరిష్కరించలేకపోయారు. వివాదం మరింత జఠిలం కావడానికి మాణికం ఠాగూర్ కూడా కారణమని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.