సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాంగ్ టక్ వెళ్లే దారిలోని నాథూలా పర్వతలోయ ప్రాంతంలో భారీ హిమపాతం సంభవించింది. ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాష్ట్ర రాజధాని గాంగ్‌టక్‌కు తరలించారు. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో దాదాపు 150 మందికిపైగా పర్యాటకులు అక్కడున్నట్లు సమాచారం.
గాంగ్‌టక్‌ను, చైనా సరిహద్దు సమీపంలోని నాథులా పాస్‌ను కలిపే జవహార్‌లాల్ నెహ్రూ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు రహదారుల సంస్థ, సిక్కిం పోలీసులు, స్థానిక అధికారుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 22 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాల్లో చిక్కుకుపోయిన 350 మంది పర్యాటకులనూ కాపాడినట్లు తెలిపారు.