ఒలింపిక్స్ లో అర్హత సాధించడం ఒక ఎత్తయితే… మెడల్ సాధించడం మరో ఎత్తు. నిజంగా క్రీడల్లో రాణించాలి అంటే దానికి తగ్గ సాధన చేయాలి. అయితే లవ్లీనా మాత్రం ఎంతో సాధన చేసి గెలుపొందింది. అస్సాంలోని మారుమూల గ్రామంలో కనీసం రోడ్డు సదుపాయం లేని ఊరు అది. కేవలం అక్కడ అంతా మట్టిరోడ్డు ఉంటుంది. కానీ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా గెలుపొందిన తర్వాత ఆ గ్రామం పేరు మారుమ్రోగి పోతోంది అనే చెప్పాలి.
విశ్వ క్రీడల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనతను సాధించింది లవ్లీనా. అయితే లవ్లీనా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంది అనుకుంటే పొరపాటు. చిన్ననాటి నుండి ఎన్నో వేధింపులు, కష్టాలు అనుభవించింది. నిజంగా ఈ కష్టాలనన్నిటిని దాటుకుంటూ విజయాల్ని పొందుతోంది. 2009లో కోచ్ ప్రశాంత్ కుమార్ దాస్ వద్ద తన అక్కలతో పాటు శిక్షణ తీసుకుంది. ఈ ముగ్గురు కూడా 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోచింగ్ సెంటర్ కి సైకిల్ మీద వెళ్లేవారు. రాళ్ళు, రప్పలు మట్టి రోడ్డు మీద ఈ ముగ్గురు వెళ్లి కష్టపడేవారు.
ఇది ఇలా ఉంటే లాక్‌డౌన్ సమయంలో ఏకంగా పొలంలో పనులు కూడా చేసింది లవ్లీనా. అయితే ఈమె కెరీర్ మలుపు తిరగడానికి కారణం పదమ్ బోరో. ఈ కోచ్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా లవ్లీనా ఎదిగింది. 2020లో జోర్డాన్ లో ఆసియా క్వాలిఫయర్లో మెరుగైన ప్రదర్శన చూపించింది. అయితే మరొకసారి అంతా సవ్యంగా ఉంది అనుకునేసరికి తన తల్లికి కిడ్నీ సమస్య వచ్చింది.
దీనితో ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంటికి తిరిగి వచ్చిన లవ్లీనాకి కరోనా సోకింది దీంతో ఆమె శిక్షణ లేకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనాని జయించి మరొకసారి పట్టుదలతో శిక్షణ తీసుకుని ఈ 23 ఏళ్ల బాక్సర్ తన సత్తా చాటుకుంది. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈమె వరల్డ్ ఛాంపియన్షిప్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏసియన్ గేమ్స్ లో కూడా సత్తాను చాటుకుంది. ఇలా భారతదేశం అంతా కూడా గర్వపడేలా చేసింది లవ్లీనా.
అయితే వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు కావడం వల్ల ఈమె తల్లిదండ్రుల్ని సమాజం ఎన్నో మాటలు అన్నారని చెప్పారు. గత జన్మలో చేసిన పాపం వల్లనే కొడుకు పుట్టలేదని చాలామంది వేధించారు అని అన్నారు. బాక్సింగ్ చేయడం చూసిన వాళ్ళు కూడా ఎంతో మంది లవ్లీనాని ఎన్నో మాటలు అన్నారు అని అటువంటి వాళ్ళకి నిజంగా ఈ పతకం సమాధానం ఇస్తుందన్నారు.