శివరాత్రి : శివుడికి మారేడుదళాలతో ఎందుకు పూజిస్తారు?

-

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పపాసంహారం ఏకబిల్వం శివార్పణం!!

శివభక్తులకు పై శ్లోకం సుపరిచితమే. పరమ శివుడికి బిల్వార్చన అంటే మారేడుదళాలతో అర్చన చేయడమనేది అత్యంత శ్రేష్ఠమని ప్రతీతి. పురాణాలు, వేదాలు, శాస్ర్తాలు ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. ఇక మరో పాట..

మారేడు నీవని ఏరేరి తేనా?! మారేడు దళములు నీ పూజకు… అన్నాడు కవీశ్వరుడు వేటూరి. అంతేకాదు మారేడు చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, లక్ష్మీ రూపంగా కూడా ఆరాధిస్తారు. మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును శివేష్ట అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.

బిల్వాలలో అద్భుత ఔషధ గుణాలు!
పూజలు, పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వ పత్రం ప్రధానమైంది, శ్రేష్ఠమైంది. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం. బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వృద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.

మారేడు ఉపయోగాలు!
మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా ఆరాధిస్తారు. ఇక దీనిలోని భాగాలు ఉపయోగాల వివరాలు తెలుసుకుందాం…

బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు.
మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది.
మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది.
ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది.
మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.

బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి.
బిల్వ ఆకులను కొబ్బరినూనెలో వేసి మరిగించి దాని నుంచి తయారైన నూనెను తలకు మర్దన చేస్తే తలపోటు, మైగ్రేన్ వంటివే కాకుండా మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version