రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్ కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భీమడోలుకు చెందిన రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ శృంగవృక్షం నరసయ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎంపీ భరత్ కారులోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఉదయం ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు.
ఏపీలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తుండటంపై భరత్ మండిపడ్డారు. రైతుల కోసం రాత్రి వేళల్లో పర్యటిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన మార్గాని భరత్.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. చంద్రబాబుని టార్గెట్‌గా చేసుకుని కూడా మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. ఆయన ఇంకా పాత చిప్‌నే వాడుతూ అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు 300 కరువు మండలాల్ని ప్రకటిస్తే కనీసం ఒక్క మండలంలో కూడా చంద్రబాబు పర్యటించలేదని గుర్తు చేశారు. రైతులను చంద్రబాబు ఏరోజూ ఆదుకునే ప్రయత్నం చేయలేదని.. కానీ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.