విషాదం : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఆరుగురు మృతి

-

చిత్తూరు జిల్లాలో పెళ్లి ఇంట విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యఊరు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో.. ఆరుగురు ఊపిరాడక మృతిచెందారు. మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం కావడంతో ఆగ్రామంలో విషాదం నెలకొంది. గాయాలపాలైన 19మందిని చికిత్స కోసం చిత్తూరు, తిరుపతి, వేలూరు ఆసుపత్రులకు తరలించారు. ఐరాల మండలం బలిజపల్లెకు చెందిన హేమంత్ కుమార్‌తో.. పూతలపట్టు మండలం జెట్టిపల్లెకు చెందిన భువనేశ్వరికి గురువారం ఉదయం జెట్టిపల్లెలో వివాహం జరగాల్సి ఉంది. బలిజపల్లె నుంచి 26 మంది పూతలపట్టు మండలం జెట్టిపల్లికి.. పెళ్లికుమారుడితో సహా బుధవారం రాత్రి 8గంటల 45నిమిషాలకు ట్రాక్టర్లో బయలుదేరారు.

పెళ్లి కుమార్తె స్వగ్రామమైన జెట్టిపల్లిలోని పెళ్లి మండపానికి మరో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా లక్ష్మయ్యఊరు వద్దకు చేరుకోగానే ప్రమాదం జరిగింది. లక్ష్మయ్యఊరు సమీపంలో ఎత్తు ప్రాంతం నుంచి దిగుతుండగా.. ఇంధనం ఆదా కోసం ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్రెడ్డి ఇంజిన్‌ ఆపాడు. వేగంగా దూసుకెళ్తున్న వాహనం అదుపు తప్పి ఐదడుగుల గుంతలో పడింది. దీంతో ట్రాక్టరు వెనుక ట్రాలిలో ఉన్నవారు ఒకరిపై ఒకరు పడటంతో..ఊపిరి ఆడక ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారు.

స్థానికులు, సమాచారం అందుకొన్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం వారిని తిరుపతిలోని స్విమ్స్, వేలూరులోని సీఎంసీ ఆసుపత్రులకు తరలించారు. చిత్తూరు ఆసుపత్రిలో క్షతగాత్రులను కలెక్టర్, ఎస్పీ పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. ట్రాక్టర్ అతివేగంగా వెళుతూ అదుపు తప్పి ఐదు అడుగులలోతు ఉన్న వాగులోకి పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ట్రాక్టర్‌లోనే పెళ్లి కుమారుడు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ప్రమాదంతో పెళ్లి కూడా అర్ధాతరంగా ఆగిపోయి పెళ్లింట విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version