ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకీ 1.81 లక్షలకు పైగా పలు మోడల్స్‌కు చెందిన కార్లను వెనక్కి రప్పిస్తోంది. తాము విక్రయించిన పలు మోడల్స్‌కు చెందిన పెట్రోల్ వేరియెంట్ కార్లనే మారుతీ సంస్థ రీకాల్ చేస్తోంది. డీజిల్ మోడల్ కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ సంస్థ తెలియజేసింది.
మారుతీ సుజుకీ కి చెందిన సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్ క్రాస్, ఎక్స్ఎల్6 కార్లను వెనక్కి రప్పిస్తోంది. కనుక ఈ మోడల్ కార్లను కొనుగోలు చేసిన వారు వాటిని కంపెనీ సర్వీస్ సెంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. మే 4, 2018 నుంచి అక్టోబర్ 27, 2020 మధ్య తయారైన సదరు మోడల్స్‌కు చెందిన కార్లను మారుతీ సంస్థ రీకాల్ చేస్తోంది.
వాహనదారులు తమ ఆర్‌సీపై ఉండే మానుఫాక్చరింగ్ తేదీని సరి చూసుకుని పైన తెలిపిన తేదీల్లో గనక కారు తయారు అయి ఉంటే తమ కారును సర్వీస్ సెంటర్‌లో అప్పగించాల్సి ఉంటుంది. లేదా మారుతీ సుజుకీ సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లోనూ మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
సదరు కార్లకు గాను మారుతీ సంస్థ ఉచితంగా ఇన్‌స్పెక్షన్ సర్వీస్‌ను అందిస్తోంది. ఆయా కార్లలో ఉండే పలు విడి భాగాల్లో తయారీ లోపాలు ఉన్నాయని, అందువల్లే ఆ కార్లను వెనక్కి రప్పిస్తున్నామని మారుతీ సంస్థ తెలియజేసింది. అయితే విడి భాగాలను మారిస్తే మళ్లీ కొత్తగా డబ్బులు చెల్లించాలా, వద్దా అన్న విషయాన్ని సర్వీస్ సెంటర్‌లో సిబ్బంది తెలియజేస్తారు.