జోర్డాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఫైజల్ అల్ షాబౌల్ తెలిపారు. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ను తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు అది కింద పడటంతో గ్యాస్ లీకేజీ అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం భారీ పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అలాగే గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను ఘటనా స్థలానికి పంపినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రస్తుతం 199 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్థానికులు తమ ఇళ్లల్లోనే ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వైద్యులను సంపద్రించాలన్నారు.