అమరావతి: వెండితెరపై చెరగని ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి.. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే, ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. నెమ్మదినెమ్మదిగా మళ్లీ తనకిష్టమైన సినీ రంగంలోనే బిజీ ఆయ్యారు చిరు. అయితే, ప్రస్తుతం ఆయన మళ్లీ రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా మారబోతున్నారని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేనకు అండగా చిరు నిలవబోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.
దీనికి బలం చేకూర్చేలా జనసేన నేత నాదేండ్ల మనోహర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టబోతున్నారనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. పవన్ కళ్యాణ్ వెంట త్వరలోనే చిరంజీవి నడవబోతున్నారనీ, ఈ విషయమై ఇప్పటి జనసేనకు అండగా ఉంటానని చిరు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ విషయం పట్ల జనసేన శ్రేణులతో పాటు మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికల అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎన్నికల విషయమై ఇప్పటికే బీజేపీ, జనసేనలు సమావేశమై చర్చించాయని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నియంత పాలన కోనసాగుతోందని ఆరోపించారు. జగన్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయంటూ విమర్శించారు. ఇక ఎన్నికలు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో జరగాలనీ, దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వమ్యంలో ఎన్నికలు జరగాలనీ, ఏకగ్రీవాలకు జనసేన వ్యతిరేకమని నాదేండ్ల ప్రకటించారు.