ట్రంప్ అడుగుజాడల్లోనే భార్య..మాస్క్‌ లేకుండానే వోటు !

కరోనా సమయంలో ట్రంప్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆయన మాస్కు పెట్టుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడి పోయాడు. ముందు నుంచే మాస్క్ లను హేళన చేస్తూ వచ్చిన ట్రంప్, కరోనా వచ్చినా సరే ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఆయన భారీగా నేనేం తక్కువ తిన్నానా అనుకున్నారో ఏమో మెలానియా ట్రంప్ పద్ధతి కూడా అలానే అనిపించింది. అమెరికా ఎన్నికల నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫ్లోరిడాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితమే ఎర్లీ ఓటింగ్‌లో భాగంగా ఓటు వేసేయగా మెలానియా మాత్రం ఎన్నికల రోజు ఓటు వేసేందుకు నిశ్చయించుకున్నారు. భారీ సెక్యూరిటీ నడుమ పామ్ బీచ్‌లోని మోర్టన్ అండ్ బార్బరా మాండెల్ రీక్రియేషన్ సెంటర్‌లో ఆమె ఓటు వేశారు. అయితే ఆమె ఫేస్‌మాస్క్ లేకుండా ఓటు వేసేందుకు రావడం ఇప్పుడు వివాదంగా మారింది. పామ్ బీచ్ ప్రాంతంలో ఫేస్‌మాస్క్ తప్పనిసరి అయినప్పటికి.. మెలానియా ఫేస్‌మాస్క్‌ను ధరించలేదు. మెలానియా కరోనా బారిన పడినప్పటికీ ఫేస్‌మాస్క్ ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అయితే భర్త అడుగు జాడల్లోనే నడుస్తోంది అంటూ పెదవి విరుస్తున్నారు.