రమీరెజ్ భార్య వెనెస్సా ముందుగానే ఈదుకుంటూ నదిదాటి అవతలికి చేరింది. కానీ కూతుర్ని వెనుక టీషర్టులో కట్టుకున్న రమీరెజ్ మాత్రం ఈదలేక నదిలో మునిగిపోయాడు. దీంతో కొన్ని గంటల తరువాత వారి మృతదేహాలు నది ఒడ్డున తేలాయి.
మెక్సికో నుంచి అమెరికాకు వలస వెళ్లాలనుకునే అనేక మంది శరణార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోజుల తరబడి అంతర్జాతీయ సరిహద్దు వద్ద వేచి ఉంటే గానీ అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి లభించదు. ఇక కొన్ని సార్లయితే గేట్లను మూసేస్తే వాటిని తెరిచే వరకు అక్కడే పడిగాపులు కాయాలి. అయితే ఇదంతా శ్రమ ఎందుకనుకునే కొందరు మాత్రం అమెరికాకు అక్రమంగా వలస వెళ్లేందుకు యత్నిస్తుంటారు. అలాంటి వారిలో కొందరు మృత్యువాత పడుతుంటారు. తాజాగా ఓ కుటుంబం కూడా ఇలాగే చేయాలని యత్నించింది. కానీ వారి ప్రయత్నం విఫలం కావడంతో ఆ కుటుంబంలోని తండ్రి, కూతురు మృతి చెందారు. ఇప్పుడీ ఘటనకు చెందిన ఫొటో ఒకటి నెట్‌లో వైరల్‌గా మారింది.
పైన చూపించిన ఫొటోలో ఉన్నది ఒక తండ్రి, అతని 23 నెలల కూతురు. వారి పేర్లు ఆస్కార్ ఆల్బర్టో మార్టినెజ్ రమీరెజ్, వలేరియా. రమీరెజ్ తన భార్య వెనెస్సా అవలోస్, కుమార్తె వలేరియాలతో కలిసి మెక్సికోలోని మటామొరస్ వద్ద అమెరికా సరిహద్దుకు చేరుకున్నారు. వారు శరణార్థులుగా అమెరికాలో ఉండేందుకు అక్కడ దరఖాస్తు చేసుకుందామని వచ్చారు. అయితే రెండు రోజుల వరకు అంతర్జాతీయ సరిహద్దు గేట్లు తెరవరని చెప్పడంతో.. వారు అక్కడికి సమీపంలో ఉన్న రియో గ్రాండె అనే నదికి చేరుకున్నారు. ఆ నది అమెరికాను, మెక్సికోను వేరు చేస్తుంది. నది దాటితే అమెరికాలోకి ప్రవేశించవచ్చని చెప్పి రమీరెజ్ తన భార్య, కుమార్తెలతో కలసి నది ఒడ్డుకు చేరుకున్నాడు.
అయితే రమీరెజ్ భార్య వెనెస్సా ముందుగానే ఈదుకుంటూ నదిదాటి అవతలికి చేరింది. కానీ కూతుర్ని వెనుక టీషర్టులో కట్టుకున్న రమీరెజ్ మాత్రం ఈదలేక నదిలో మునిగిపోయాడు. దీంతో కొన్ని గంటల తరువాత వారి మృతదేహాలు నది ఒడ్డున తేలాయి. వారిద్దరి శరీరాలు బోర్లా పడి ఉండగా, వలేరియా తల తన తండ్రి టీషర్టులో ఉంది. ఆమె చేయి తన తండ్రి వెనుక మెడ మీద వాటేసుకున్నట్లుగా ఉంది. దీంతో ఆ దృశ్యాన్ని చూసి అక్కడి వారు చలించిపోయారు. కాగా ఈ ఫొటో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారడంతో నెటిజన్లు కూడా ఆ దృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంలోనూ ఇలాంటి ఒక సంఘటనలో సిరియాకు చెందిన ఐలన్ కుర్ది అనే ఓ 3 ఏళ్ల బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శరణార్థిగా సముద్రం దాటి వెళ్తుండగా వారి పడవ మునగడంతో అతను సముద్రంలో మునిగి మృతి చెందాడు. ఆ తరువాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకువచ్చింది. ఈ క్రమంలో అప్పట్లో ఆ ఫోటో చాలా మందిని తీవ్రంగా కలచి వేసింది. ఇక మళ్లీ ఇప్పుడు ఈ ఘటన కూడా అలాగే జరగడంతో చాలా మంది దాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు..!