ఎవరైనా హిజాబ్ ధరిస్తే ఏంటి సమస్య..? కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పు మతం, సంస్కృతి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని.. ఆర్టికల్ 15కు వ్యతిరేఖం అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పును ఆయన ఖండించారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదని ఆయన అన్నారు. ముస్లిం మహిళలు టార్గెట్ చేయబడుతున్నారని.. ఈ తీర్పు వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. హైకోర్ట్ ఉత్తర్వులు అల్లా ఆజ్ఞలు, విద్య మధ్య ఎంచుకోవాలని బలవంతం చేసేలా ఉన్నాయని విమర్శించారు.
హిజాబ్ నిషేధం విధించడం వల్ల ముస్లిం మహిళలు, వారి కుటుంబాలు విద్యకు దూరం అవుతారని ఓవైసీ అన్నారు. యూనిఫాం ఏకరూపతను ఎలా నిర్ణయిస్తుందని.. కులాల పేర్లు ధనిక, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఎవరో తెలియజేయదా.. ? అంటూ ప్రశ్నించారు. హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్ట్ లో తేల్చుకుంటామని అన్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పును కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై తో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి, ఇతర బీజేపీ ఎంపీలు స్వాగతించారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంలు
మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత ఒమర్ అబ్దుల్లా తీర్పును తప్పుబట్టారు.