పంజాబ్‌లో కల్తీ సారా తాగిన ఘటనలో 100 మంది వరకు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ కేసును సీబీఐచే దర్యాప్తు చేయించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాగా దీనిపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పని తాను చూసుకుంటే బాగుంటుందని అన్నారు. పంజాబ్‌లో ప్రతిపక్ష పార్టీగా ఉండి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా పనిచేయడం లేదని దుయ్యబట్టారు.
కల్తీ సారా ఘటనలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని పంజాబ్ సీఎం అన్నారు. పోలీసులు కేసును చక్కగానే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనకు కారకులైన వారిగా భావిస్తున్న 30 మందిని అరెస్టు చేశామని, 3 జిల్లాల్లో మొత్తం 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని, మరో 13 మంది పోలీసు, ఎక్సైజ్, టాక్సేషన్ అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసులకు కావల్సిన అన్ని అధికారాలను ఇచ్చామని, వారు నిందితులు ఎవరైనా సరే విడిచిపెట్టబోరని స్పష్టం చేశారు.
సీఎం కేజ్రీవాల్ తన పని తాను చూసుకోకుండా పంజాబ్‌లో ఎందుకు వేలు పెడుతున్నారని సీఎం అమరీందర్ సింగ్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసమే కేజ్రీవాల్ ఈ కేసును సీబీఐచే దర్యాప్తు చేయించాలని అంటున్నారని పేర్కొన్నారు. పంజాబ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారని, నిందితులను ఎవరినీ విడిచిపెట్టేది లేదని, అక్రమార్కులకు సహకరించే ప్రభుత్వ ఉద్యోగులను కూడా విడిచిపెట్టబోమని అన్నారు.