ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరికి మళ్ళీ వరద వచ్చే పరిస్థితి ఉందన్నారు. అంతేకాకుండా.. పోలవరం, ధవళేశ్వరం దగ్గర పది లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాగార్జున సాగర్ నిండుతోందని, కృష్ణా నదికి కూడా వరద తాకిడి ఉండే అవకాశం ఉందన్నారు. పై నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు కిందికి వచ్చే అవకాశం ఉందని, కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓబుళాపురం మైనింగ్ పై టీడీపీ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని, అక్కడ చాలా కాలం నుంచి వివాదం ఉందన్నారు మంత్రి అంబటి.
ఎవరైనా సుప్రీం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, 2018 లో పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు కాళ్లు, చేతులు పైకి ఎత్తేశాడని ఆరోపించారు మంత్రి అంబటి. లోయర్ కాఫర్ డ్యాంను రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న సమయానికి ఎందుకు పూర్తి చేయలేదని, లోయర్, అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు?? అని మంత్రి అంబటి ప్రశ్నించారు. నవయుగ రామోజీ రావు వియ్యంకుడని, నవయుగను తీసేసి మెగా వాళ్ళకు ఇచ్చామని కడుపు మంట అని మంత్రి అంబటి అన్నారు. దోచుకుందాం…దాచుకుందాం అనుకున్నారని, ట్రాన్ స్ట్రాయ్ ను తీసేసి చంద్రబాబు నవయుగ నామినేషన్ పద్ధతిలో ఇచ్చింది వాస్తవం కాదా?? మేము రివర్స్ టెండర్ ద్వారా మరింత తక్కువకు మెగాకు ఇచ్చామన్నారు మంత్రి అంబటి.