మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా మెజారిటీతో విజేతగా నిలిచారు. ఈ విజయం అనంతరం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులను నల్లగొండ గడ్డపై మొట్టమొదటి సారిగా 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టినందుకు, కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, చైతన్యానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయని పెద్దలు ఎప్పుడో చెప్పారని, ఈ ఉప ఎన్నికల్లో అదే జరిగింది.
అహంకారం, డప్పు మదం, రాజకీయ కళ్లునెత్తికెక్కి, పొరుగుతో బలవంతుపు ఉప ఎన్నిక ఉప ఎన్నికను తెలంగాణ, మునుగోడు ప్రజలపై రుద్దింది ఢిల్లీ బాస్‌లు నరేంద్ర మోదీ, అమిత్‌షా. ఇద్దరి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగుర వేసినందుకు సంతోషపడుతున్నం. రుద్దిన ఎన్నికను.. రుద్దిన వారికే మీరు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన మొఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డిదే కావొచ్చు. వెనుకుండి నాటకం మొత్తం నడిపింది అమిత్ షా, నరేంద్ర మోదీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు’ అన్నారు.
‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేయడంతో పాటు తెలంగాణలోనూ క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది బీజేపీ పార్టీ. దీని వెనక ఉందని అమిత్ షా, నరేంద్ర మోదీ అని తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని, బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో తొక్కి.. చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. నిజానికి టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇంకా మెజారిటీ రావాల్సి ఉండే. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది. కానీ, బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం.. మాకున్న సమాచారం ప్రకారం.. మొట్టమొదటి సారిగా ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలను తరలించారు అని ఆయన వ్యాఖ్యానించారు.