తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదంటూ వంగ్యాస్త్రాలు సంధించారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించగలరా అంటూ సవాల్ విసిరారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి చేవేళ్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్‌షాను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే అంతకు ముందు చేవెళ్లలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్‌పై ప్రశ్నించారని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు.