కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం. ఫామ్ హౌస్ లోనే ఉండి మాట్లాడతారా..లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. 13 నెలల పాటు ఫామ్ హౌజ్ కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. వర్షాలు వచ్చినా.. వరదలు వచ్చినా కనీసం ప్రజలను పరామర్శించలేదు. ఫామ్ హౌస్ దాటలేదు.
ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని కేసీఆర్ వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయి. ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారు. ప్రజలన్నా.. ప్రజాతీర్పు అన్నా కేసీఆర్ కు ఏనాడూ గౌరవం లేదు. పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా కనీసం కృతజ్ఞత తెలపలేదు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కూడా ప్రకటించలేదు. ఈ ఏడాది కాలంలో నల్గొండ, కరీంనగర్ బీఆర్ఎస్ సభల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్రకటనలే చేశారు. ఆ తర్వాత ఏమయ్యారో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షనేతగా అసెంబ్లీ ముఖం చూడని వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి, నేనున్నానని చెప్పుకోవడానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారు అని మంత్రి పొంగులేటి అన్నారు.