– బీజేపీ అనే అంటూ రోగం ఖమ్మం ప్రజలకు అంటుకోదు
– కమళంపై రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు
హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో ఘటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బండి సంజయ్ కి కౌంటర్ ఇస్తూ.. బండి సంజయ్ 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాపై, అలాగే, మమతా మెడికల్ కాలేజీపై విచారణ జరుపుతామని అన్నావ్ కాదా ! ప్రస్తుతం కేంద్రంలో మీ పార్టీనే అధికారంలో ఉంది. నీకు దమ్ముంటే ఇప్పడు నాపై విచారణ చేయించు అంటూ మంత్రి సవాలు విసిరారు.
ఖమ్మంలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పలువురు అధికార పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీ ఒక అంటురోగం లాంటిదనీ, కరోనా కంటే ప్రమాదకరమైనదని అన్నారు. అయితే, రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న ఖమ్మం ప్రజలకు బీజేపీ అంటూ రోగం అంటుకోదంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆయనపై ఇటీవల బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కమళం నేత బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నిక ల సమయంలోనే కొందరు సందర్శకులు ఖమ్మంలో పర్యటించారన్నారు. నాగులు ఓట్లు, సీట్ల కోసం వ్యక్తి గత దూషణలకు దిగడం బీజేపీకే చెల్లిందని పేర్కొన్నారు. ఖమ్మం పర్యటన సందర్భంగా కమళం నేతలు ఇచ్చిన వ్యాక్సిన్ పనిచేయలేదనీ, కానీ కూకట్ పల్లిలో తామిచ్చిన టీకా బీజేపీ నేతలపై బాగానే పనిచేసిందంటూ కౌంటర్ ఇచ్చారు. కూకట్‌పల్లి డివిజన్ లో ఏడు కార్పోరేటర్లలో ఆరు గెలుచుకొని బండి సంజయ్ కి తాము వ్యాక్సిన్ వేశానని పువ్వాడ చురకలంటించారు.
అలాగే, బండి సంజయ్ వ్యక్తిగత విషయాల్లో తల దూర్చడం, లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తున్న మమతా ఆస్ప్రత్రిపై ఈ విధమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. తన పై చేసిన ఆరోపణలు నిరూపించడానికి 2023 వరకూ ఎందుకు.. దమ్ముంటే ఇప్పడే విచారణ జరిపి నిరూపించాలంటూ సవాలు విసిరారు. కాగా, రాష్ట్రంలో పది చోట్ల ఇలాంటి మార్కెట్లు నిర్మిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సమీకృత మార్కెట్లతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.