దిశ యాప్ మరింత సులభతరం.. ఫోన్ ను 5 సార్లు కదిపితే పోలీసులకు సమాచారం

అమరావతి: మహిళల భద్రతపై సీఎం వైయస్‌ జగన్‌ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి. రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. దిశ యాప్ వినియోగం పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారని  హోం శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్ ఉంటే ఆపద సమయంలో బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదని.. ఫోను ను 5 సార్లు కదిపితే దగ్గరలోని పోలీసులకు సమాచారం చేరుతుందన్నారు.

నది ఒడ్డు మొత్తం సీసీ కెమెరాలు పెట్టడం సాధ్యం కాదని…. సీసీ కెమెరాల ఏర్పాటు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారని ఆమె వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలని…కనీసం స్నేహితులు, బంధువులకు అయినా సమాచారం ఇవ్వాలన్నారు. బాధితురాలు కూడా ఈ ఘటనకు పాల్పడింది ఇద్దరే అని చెప్పిందని హోం శాఖ మంత్రి వెల్లడించారు.