తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు మేనియా నడుస్తోంది. ఎక్కడా చూసిన మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు ఓటర్లను కోరారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి ప్రాంతానికి చెందినవారై హైదరాబాద్‌లో ఉంటున్న ఓటర్లతో ఎల్బీ నగర్‌లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి జరుగుతున్నదన్నారు మంత్రి తలసాని.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్ల వచ్చిందని, రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని మంత్రి తలసాని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే గెలిపించాలని కోరారు మంత్రి తలసాని.