మోడీ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై మోడీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు మాట్లాడడం హేయమన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం అబద్ధమని.. ఎన్డీయేలో కలవమని బతిమిలాడితే దేశాన్ని అమ్మేవారితో కలమని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. మోదీపై నిప్పులు చెరిగారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రిపై ప్రధాని స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అసలు మోదీయే అత్యంత అవినీతిపరుడని అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నయాన్నారు.
దేశంలో ప్రభుత్వ సంస్థలన్నీ తన మిత్రుడు ఆదానీకి అప్పనంగా కట్టబెడుతున్నాడని, ఆస్ట్రేలియా బొగ్గు గనులు, శ్రీలంక పవర్ ప్రాజెక్టులు మోదీ ప్రమేయంతోనే వచ్చాయని ఆ దేశాలకు చెందిన అత్యున్నత వ్యక్తులే బహిరంగంగా చెప్పారని, అక్కడి దేశ ప్రజలకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసనలు తెలిపారని గుర్తు చేశారు. మోదీ సచ్చీలుడైతే అవి అబద్ధాలని నిరుపించాలని డిమాండ్ చేశారు. మరోసారి అధికారం ఇవ్వండి.. అవినీతిని అంతం చేస్తానని ప్రధాని చెప్పిండు. ఈ పదేండ్లు ఏం జేసినవ్ గడ్డి పీకినవా..నువ్ అవినీతిని అంతం చేసే మొనగాడివి అయితే, నీకు దమ్ము, ధైర్యం ఉంటే మొదలు అదానీ అక్రమాలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.