ఆ మంత్రిని చూసి  ఎంపీ, ఎమ్మెల్యే ఓర్వ‌లేక‌పోతున్నారా..?

-

ఆ మంత్రిని చూస్తేనే ఎమ్మెల్యే, ఎంపీ ఓర్వలేక‌పోతున్నారా..?  ఎదురుప‌డినా ప‌ల‌క‌రించ‌డం లేదా..?  ఆమె ప‌ద‌వికి ఎస‌రు పెట్టాల‌ని చూస్తున్నారా..? అంటే ఆ ప్రాంత రాజ‌కీయ‌వ‌ర్గాలు మాత్రం ఔన‌నే గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ఇంత‌కీ.. ఆ మంత్రి ఎవ‌రు..? ఆ ఎమ్మెల్యే, ఎంపీ వ‌ర‌ని అనుకుంటున్నారా..?  వారు మ‌రెవ‌రో కాదు.. తెలంగాణ రాష్ట్ర గిరిజ‌న‌, శిశు, మ‌హిళా సంక్షేమ శాఖ‌ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, మ‌హ‌బూబాబాద్ ఎంపీ క‌విత‌, డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌.  మంత్రి వ‌ర్సెస్ ఎంపీ, ఎమ్మెల్యే రాజ‌కీయం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది.

పార్టీ కార్య‌క్ర‌మాల్లో, ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల్లో వీరిమ‌ధ్య ప‌ల‌క‌రింపులు ఉండ‌డం లేదు. ఎవ‌రిదారిన వారు వ‌స్తున్నారు.. పోతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కందికొండ జాత‌ర‌కు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, తండ్రీ కూతురు ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌, ఎంపీ క‌విత వ‌చ్చారు. కానీ, స‌త్య‌వ‌తిని రెడ్యా ప‌ల‌క‌రించ‌లేదు.. రెడ్యాను మంత్రి స‌త్య‌వ‌తి ప‌ల‌క‌రించ‌లేదు. దీంతో వీరి మ‌ధ్య వార్ మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైంది. మొత్తంగా తొలిసారి మంత్రి అయిన స‌త్య‌వ‌తి రాథోడ్‌కు ఎంపీ, ఎమ్మెల్యే స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ఒంట‌రిని చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

నిజానికి.. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో డోర్న‌క‌ల్ టికెట్ స‌త్య‌వ‌తి రాథోడ్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయ‌క్‌కే టికెట్ ద‌క్కింది. అయితే, స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వ‌డంతో.. ఆమె సైలెంట్‌గా ఉన్నారు. అయితే.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో తండ్రీ కూతురు ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌, ఎంపీ క‌విత షాక్ కు గుర‌య్యారు. స‌త్య‌వ‌తిని ఎమ్మెల్సీ చేసి, ఆ త‌ర్వాత వెంట‌నే రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆమెకు స్థానం క‌ల్పించ‌డంతో ఎమ్మెల్యే, ఎంపీ జీర్ణించుకోలేక‌పోతున్నార‌న్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల టాక్‌.

ఇంకా చెప్పాలంటే స‌త్య‌వ‌తి, రెడ్యానాయ‌క్ వియ్యంకుడు, వియ్య‌పురాలు వ‌రుస అవుతారు. ఇదే స‌మ‌యంలో రెడ్యానాయ‌క్‌, క‌విత ఇద్ద‌రూ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను క‌లిశారు. తాను సీనియ‌ర్‌నంటూ ప‌రోక్షంగా అసంతృప్తి వెల్ల‌గ‌క్కారు. సీనియ‌ర్‌గా ఉన్న త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న బాధ రెడ్యాలో ఎక్కువుగా ఉంది. అందుకే వారు స‌త్య‌వ‌తిని దూరం పెట్ట‌డంతో పాటు అదే టైంలో జిల్లాలో త‌మ‌కు చ‌నువు ఎమ్మెల్యేల‌తో కూడా వారు స‌త్య‌వతికి స‌హ‌క‌రించ‌వ‌ద్ద‌ని చెపుతున్నార‌ట‌. గ‌త మూడు నెల‌లుగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే, ఎంపీగా వార్ నడుస్తోంది. మొత్తంగా మంత్రికి వీరిద్ద‌రూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ఆమెను ఒంట‌రిని చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version