మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు.. అని ఎదురు చూడకూడదు. మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ కూడా ఇదే చూపించారు. ఓ ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని అక్కడి మరుగుదొడ్లు శుభ్రంగా లేవని ఫిర్యాదు చేయడంతో.. ఆయన స్వయంగా చీపురు పట్టి టాయిలెట్‌ను కడిగారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో ఉన్న కమిషనర్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని కార్యాలయంలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తోమర్ వెంటనే క్లీనింగ్ మెటీరియల్ తీసుకుని టాయిలెట్ కడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లలోనే కాదు పనిచేసే చోట్ల కూడా టాయిలెట్లను మనం శుభ్రం చేసుకోవాలని, దీంతో విష జ్వరాలు రాకుండా ఉంటాయన్నారు. ముఖ్యంగా మహిళలు ఉండే చోట టాయిలెట్లను ఇంకా శుభ్రంగా ఉంచాలన్నారు.
ఆ కార్యాలయంలో టాయిలెట్లు అలా దుర్గంధంతో నిండి ఉండడంపై మంత్రి తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతలను పాటించినప్పుడే అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చని అన్నారు. కాగా ఆయన అలా టాయిలెట్ కడుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు అందరూ ఆ మంత్రి సింప్లిసిటీని అభినందిస్తున్నారు.