పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. ప్రపంచపర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎమ్మెల్యే విడదల రజిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పర్యావరణం దెబ్బతినకుండా ఉండాలంటే ఇంధనం, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు. వాతావరణం కలుషితమైపోతుండటం వల్ల సహజవనరులు దెబ్బతింటున్నాయని తెలిపారు. స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోలేకపోతున్నామని తెలిపారు. దీనివల్ల మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకమైపోతోందన్నారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు శాతం పెరుగుతుందని తెలిపారు. వృక్షాలు పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సమాజరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణే “మనం- మనశుభ్రత” లక్ష్యం..!
-