అర్హులందరికి ఇళ్లు మంజూరుకావాల్సిందేనని, ఈ విషయంలో పార్టీ వివక్ష చూపొద్దని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే విడదల రజిని గృహ నిర్మాణశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నిర్మాణాలు ఎప్పుడు మొదలైన కట్టేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతానికి లేఅవుట్ల దశలో ప్లాట్లు ఉన్నాయని, లేఅవుట్లు, భూ అబివృద్ధి, వసతుల ఏర్పాటు పూర్తయ్యిన వెంటనే వచ్చే నెల 8వ తేదీన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరుచేస్తామని తెలిపారు. ఆ వెంటనే ప్లాట్లలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతుందని చెప్పారు. ఎప్పుడు నిర్మాణాలు మొదలైనా… శరవేగంగా పనులు చేపట్టేందుకు అన్ని సిద్ధం చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఎమ్మెల్యే అప్రమత్తం చేశారు. చిలకలూరిపేట రూరల్ మండలం, పట్టణంలో కలిపి 5651 ప్లాట్లను, యడ్లపాడు మండలంలో 1874, నాదెండ్ల మండలంలో 1157 ప్లాట్లను ప్రభుత్వం నిరుపేదల కోసం సిద్ధం చేస్తోందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం దశల వారీగా చేపట్టినా.. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పేదలందరికీ ఇళ్లు.. పథకం సవ్యంగా సాగేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ ఎస్.వెంకట్రావు, యడ్లపాడు ఏఈ ఎన్ఎంఎం నాయుడు, నాదెండ్ల ఏఈ రామకృష్ణనాయక్ తదితరులు ఉన్నారు.