సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ రాశారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూలి రేటు రూ.400లకు పెంచాలని లేఖలో పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేకంగా వేసవి భత్యం కల్పించాలని సీఎంను రిక్వెస్ట్ చేశారు. వేసవి భత్యం మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలకు గాను 30 శాతం కల్పించాల్సి ఉన్నా ఈ విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని.. ఇది బాధాకరం అని అన్నారు.
శుక్రవారం సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో మరిన్ని అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు (NREGS) గతేడాది కూలి రేటు రూ.300 చెల్లించగా, ఈ ఏడాది కేవలం రూ. 7 పెంచి, ప్రస్తుతం రూ. 307 మాత్రమే చెల్లిస్తున్నారని గుర్తుచేశారు.వేసవిలో చెల్లించే కరువు భత్యం సైతం చెల్లించకపోవడంతో ఉపాధీ హామీ కూలీలు చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూలీలకు రోజువారి కూలి రేటు రూ.400 చెల్లిస్తున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేయాలని కోరారు.