ఢిల్లీమద్యం సిండికేట్ల వ్యవహారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు సిబిఐ విచారించనుంది. సిఆర్‌పిసి 160 కింద కవితకు ఇప్పటికే సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసు విచారణలో భాగంగా.. మద్యం పాలసీకి సంబంధించి కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అనే కోణంలో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకోనున్నారు. 11 గంటలకు అధికారులు రానున్న నేపథ్యంలో ఆమె నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో సీబీఐ వివరణ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం కవిత కేసీఆర్‌ను కలుసుకున్నారు. వీరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఏర్పాటైన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి.
‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అంటూ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో వెలసిన బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నిజానికి కవిత సీబీఐ అధికారుల ముందు ఈ నెల 6వ తేదీనే హాజరు కావాల్సి ఉంది. కానీ ఆ రోజు కవితకు వేరే కార్యక్రమాలు ఉండటంతో.. అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ లేఖ రాశారు. దీంతో ఆదివారం వివరణ తీసుకునేందుకు అధికారులు వస్తున్నారు. కవితను అధికారులు ఏం ప్రశ్నించబోతున్నారు. ఆమె వారికి ఏం వివరణ ఇవ్వబోతుందనేది ఇప్పుడు పొలిటికల్ టాక్.